Telangana: హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడే మొదలైంది: కేటీఆర్
- హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంది
- సరికొత్త టెక్నాలజీలకు హైదరాబాద్ హబ్ గా మారింది
- ఐటీ ఎగుమతుల్లో ఈ ఏడాది బెంగళూరును అధిగమిస్తాం
హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడే మొదలైందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ జేఎల్ఎల్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుందని, హైదరాబాద్ అభివృద్ధిలో జేఎల్ఎల్ పాత్ర గొప్పదని ప్రశంసించారు.
హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో ఐటీ కంపెనీల విస్తరణకు ‘లుక్ ఈస్ట్’ పాలసీ తెచ్చామని అన్నారు. సరికొత్త టెక్నాలజీలకు హైదరాబాద్ హబ్ గా మారిందని, గూగుల్, అమెజాన్ లాంటి ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ లో బ్రాంచీలు ఏర్పాటు చేశాయని అన్నారు. కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని, ఐటీ ఎగుమతుల్లో ఈ ఏడాది బెంగళూరును అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి రూ.52 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు ఐదేళ్లలో లక్షా 9 వేల కోట్లకు పెరిగాయని అన్నారు.
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకూ మెట్రో సేవలు అందిస్తామని మరోసారి స్పష్టం చేశారు. మెట్రో రైలు ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ , కార్ పూలింగ్ ను ఉపయోగించుకోవడాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.