Kadapa District: కడప జిల్లా నందలూరు యువకుల చేతుల్లో బుల్లెట్ బైక్ లు... పోలీసుల విచారణలో వెల్లడైన అసలు విషయం!

  • తక్కువ ధరకు అమ్ముతున్న కర్ణాటక చోరులు
  • ధర తక్కువ కావడంతో ఎగబడికొన్న యువత
  • దొంగిలించినవని తేలడంతో లబోదిబో

కడప జిల్లా నందలూరు. అటు గ్రామం కాదు, ఇటు పట్టణం కాదు. అయినా ఇటీవలి కాలంలో ఎంతో మంది యువకుల చేతుల్లో బుల్లెట్ బండ్లు కనిపిస్తున్నాయి. ఊర్లోని ఎంతోమంది వీటిని నడిపిస్తూ, 'డుగ్ డుగ్ డుగ్...' మరి రోడ్లపై చక్కర్లు కొడుతుంటే, ఇంతమంది ఒకేసారి బుల్లెట్ బైకులను ఎలా కొన్నారా? అని పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంకేముంది తీగలాగితే, డొంకంతా కదిలింది. వివరాల్లోకి వెళితే...

బుల్లెట్ బైక్ ఖరీదు లక్ష రూపాయలకుపైనే ఉంటుంది. కానీ, నందలూరులో మాత్రం రూ. 25 వేల నుంచి రూ. 35 వేల లోపే. ఇంకా కొత్త బైక్ అయితే, రూ. 50 వేలు పెడితే చాలు. కర్ణాటక రాష్ట్రం నుంచి బుల్లెట్ తో పాటు పల్సర్ బైక్ లను తెచ్చి అమ్ముతున్నవారి సంఖ్య పెరిగిపోవడం, తక్కువ ధరలకు బైక్ లు లభిస్తుండటంతో, వాటిని సొంతం చేసుకునేందుకు యువత పోటీ పడింది. ఊర్లోని ఎంతో మంది వీటిని కొన్నారు.

అయితే, పోలీసులకు అనుమానం వచ్చి, రెండు రోజుల క్రితం ఓ బుల్లెట్ ను ఆపి, పత్రాలను పరిశీలించగా, అది దొంగిలించిన బైకని అర్థమైంది. అంతే, రంగంలోకి దిగి, కనిపించిన అన్ని హైఎండ్ ద్విచక్ర వాహనాలనూ తనిఖీలు చేసి, దొంగతనం చేసి తెచ్చిన వాటన్నింటినీ స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని, ఎక్కడెక్కడ బైక్ లు దొంగతనానికి గురయ్యాయో తెలుసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News