godavari districts: గోదావరి వరద ఉద్ధృతి తగ్గినా తేరుకోని లంక గ్రామాలు
- ముమ్మడివరం గ్రామాల పరిస్థితి దయనీయం
- వరదలో చిక్కుకుని కుళ్లిపోయిన పంటలు
- చాలా గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరం
గోదావరమ్మ శాంతించి వరద ఉద్ధృతి తగ్గినా గోదావరి జిల్లాల్లోని చాలా గ్రామాలు ఇంకా తేరుకోలేదు. లంక గ్రామాలు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటూ ఉండగా, మరికొన్ని గ్రామాలకు ఇంకా బాహ్యప్రవంచంతో సంబంధాలు ఏర్పడలేదు. గోదావరిలో వరద ప్రవాహం గణనీయంగా తగ్గగా ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 12.7 అడుగులు కొనసాగుతోంది. దిగువకు 11.4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ముమ్మడివరం పరిధిలోని లంక గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. పంట చేతికి అందే సమయంలో వరద విరుచుకుపడడంతో రోజుల తరబడి నీటిలో మునిగిపోయి వంగ, బెండ, మిరప పంటలు కుళ్లిపోయి పాడయ్యాయని రైతు గగ్గోలు పెడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక గ్రామాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. అయోధ్య లంకలో ఇళ్ల చుట్టూ వరద నీరు చేరి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులు గడుస్తున్నా పోలవరం, వేలేరుపాడు మండలంలోని పలు గ్రామాలు వరద ముప్పు నుంచి బయటపడలేదు. కూరగాయల తోటలు, పచ్చిక బయళ్లు నీట మునిగాయి. పశుగ్రాసం అందక మూగజీవాలు అల్లాడుతున్నాయి.