Andhra Pradesh: యూట్యూబ్ లైకుల కోసం యువకుడి వింత చర్యలు.. అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు!
- రైల్వే ట్రాకులపై గ్యాస్ సిలిండర్లు, బైకులు
- రైలు ఢీకొడుతుండగా వీడియో తీసి పోస్టింగ్
- లైకుల కోసమే చేశానన్న నిందితుడు
సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనీ, తమ వీడియోలకు ఎక్కువ లైక్ లు రావాలన్న పిచ్చి యువతలో ప్రస్తుతం విపరీతంగా పెరుగుతోంది. తాజాగా యూట్యూబ్ లో తన వీడియోలకు ఎక్కువ లైకులు రావాలని భావించిన ఓ యువకుడు రైల్వే ట్రాక్ పై గ్యాస్ సిలిండర్లు, బైకులు, టపాసులు పెట్టి వీడియోలు షూట్ చేయడం మొదలుపెట్టాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లా ఎర్నేడు మండలం చెల్లూరు కు చెందిన రామిరెడ్డి అనే యువకుడు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. తన వీడియోలకు ఎక్కువ లైకులు రావాలని భావించిన రామిరెడ్డి రైల్వే ట్రాక్ పై ఖాళీ గ్యాస్ సిలిండర్లు, బైక్ లు, బాణాసంచా పెట్టేవాడు. రైలు దానిపై నుంచి వెళుతుండగా వీడియోలు తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేవాడు.
అయితే దీన్ని నరసింహా అనే వ్యక్తి గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రామిరెడ్డిని అరెస్ట్ చేశారు. కాగా, ఇది నేరమని తనకు తెలియదనీ, యూట్యూబ్ వీడియోలకు ఎక్కువ లైకులు రావాలన్న ఉద్దేశంతోనే తాను ఈ పని చేశానని నిందితుడు పోలీసులకు చెప్పాడు.