motkupalli narasimhulu: మోత్కుపల్లి కాషాయం కండువా కప్పుకోనున్నారా?...అడుగులు అటువైపే
- సంప్రదింపులు జరిపిన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్
- ఇంటికి వెళ్లి ఆహ్వానించినట్టు సమాచారం
- సానుకూల సంకేతాలు పంపిన దళిత నేత
తెలంగాణ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు త్వరలో కాషాయం కండువా కప్పుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని సమాచారం. నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఈ దళిత నేత రాష్ట్ర విభజన అనంతరం రాజకీయంగా ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చారు. అవకాశం దొరికితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనకు అన్యాయం చేశారంటూ విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో ఉండేవారు. కొంతకాలం నుంచి ఏ పార్టీకి చెందని వ్యక్తిగా ఉన్న ఆయన ప్రస్తుతం కమల దళంలో చేరి మళ్లీ రాజకీయ పునర్వైభవానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
దళిత వర్గాల్లో కాస్త పట్టున్న నర్సింహులు పార్టీలో చేరితే తెలంగాణలో ప్లస్ అవుతుందని భావించిన బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌లను ఆయన ఇంటికి పంపి సంప్రదింపులు జరిపించినట్లు సమాచారం. ఇటీవలే ఈ ఇద్దరు నేతలు మోత్కుపల్లిని కలిసి దాదాపు రెండు గంటలపాటు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మోత్కుపల్లి కూడా సానుకూలత వ్యక్తం చేయడంతో ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం.