Nehru: జవహర్లాల్ నెహ్రూ నేరస్థుడు...నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్
- ట్విట్టర్లో విరుచుకుపడిన బీజేపీ నేత
- కశ్మీర్ విషయంలో ఆయనదే తప్పిదమని తీవ్ర విమర్శలు
- కాల్పుల విరమణ ప్రకటించి నష్టపరిచారని వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు శివరాజ్‌సింగ్ చౌహాన్ భారత్ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూపై నోరు పారేసుకున్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణను ఇటీవల పార్లమెంటు రద్దు చేయడంతోపాటు,ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ జమ్మూకశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వాదోపవాదాలు జరుగుతున్న నేపధ్యంలో శివరాజ్ ట్విట్టర్లో నెహ్రూపై విరుచుకుపడ్డారు.
‘నెహ్రూ ఓ నేరస్థుడు. ఆయన చర్యల వల్లే కశ్మీర్ కుంపటి ఇప్పటికీ రగులుతోంది. పైగా 370 అధికరణతో నెహ్రూ మరో నేరానికి ఒడిగట్టారు. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు అనే విధానం ఎంతమాత్రం సరికాదు. ఇది నేరమే’ అంటూ ట్విట్టర్లో తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. కశ్మీర్ నుంచి పాకిస్థాన్ గిరిజనులను భారత సైన్యం విజయవంతంగా తరిమేస్తుండగా హఠాత్తుగా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించి నెహ్రూ చేయరాని తప్పు చేశారని ఆరోపించారు.
అప్పటికే పాకిస్థాన్ కశ్మీర్లో మూడో వంతు భాగాన్ని తన అధీనంలోకి తీసుకుందని, ఈ పరిస్థితుల్లో కాల్పుల విరమణ వల్ల భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. అప్పుడు నెహ్రూ అలా చేసి ఉండకుంటే కశ్మీర్ మొత్తం భారత్ వశమయ్యేదని, ఇప్పుడీ సమస్యలు ఉండేవి కావని వ్యాఖ్యానించారు.