Narendra Modi: కష్టపడి పనిచేయండి.. వచ్చే ఎన్నికల్లో ఇక నాపై ఆధారపడక్కర్లేదు!: కొత్త ఎంపీలకు మోదీ సూచన
- బీజేపీ నూతన ఎంపీలకు అవగాహన సదస్సు
- హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
- ఎంపీలకు చపాతీలు వడ్డించి ఆశ్చర్యానికి గురిచేసిన ప్రధాని
వచ్చే ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటినుంచే తమ పార్టీ ఎంపీలను సంసిద్ధులను చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంపీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 2024లో తన పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకోకుండా, స్వయంకృషితో గెలవాలని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేస్తే, తన పేరు, ప్రతిష్ఠలపై ఎవరూ ఆధారపడక్కర్లేదని సూచించారు. తమ నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేయడం ద్వారా ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలని, ఆ విధంగా ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించాలని వివరించారు.
భారతీయ సంస్కృతికి అనుగుణంగా, అందుబాటులో ఉన్న మానవ వనరులను ఉపయోగించుకుని దేశాభివృద్ధికి తోడ్పడాలని మోదీ పిలుపునిచ్చారు. "మీరు ఎన్నికల్లో గెలిచారు. మీకింకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది. మీ నియోజకవర్గం కోసం కష్టపడి పనిచేయండి" అంటూ ఉద్బోధించారు.
దేశ రాజధానిలో కొత్త ఎంపీల కోసం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీలతో కలిసి విందు ఆరగించారు. అంతేకాదు, బీజేపీ సభ్యులకు స్వయంగా చపాతీలు వడ్డించారు. ఈ వివరాలను బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీడియాకు వెల్లడించారు. గంభీర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.