Narendra Modi: క్లిష్ట పరిస్థితుల్లో కూడా మోదీ తొణకలేదు, బెణకలేదు: సాహసికుడు బేర్ గ్రిల్స్
- మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమంలో మోదీతో ఎపిసోడ్ రూపొందించిన బేర్ గ్రిల్స్
- ఆగస్టు 12న డిస్కవరీ చానల్లో ప్రసారం కానున్న ప్రత్యేక ఎపిసోడ్
- మోదీ ప్రపంచస్థాయి నాయకుడు అంటూ కొనియాడిన బ్రిటీష్ యోధుడు
డిస్కవరీ చానల్లో 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంతో హంగామా చేసే అంతర్జాతీయ సాహసికుడు బేర్ గ్రిల్స్ ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సరికొత్త ఎపిసోడ్ రూపొందించాడు. భారత్ లోని ప్రఖ్యాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో ప్రతికూల పరిస్థితుల్లో ఎలా నెట్టుకురావాలో బేర్ గ్రిల్స్, మోదీలపై చిత్రీకరించారు. ఈ ఎపిసోడ్ ఆగస్టు 12న రాత్రి 9 గంటలకు డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది.
దీనిపై బేర్ గ్రిల్స్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించాడు. తమ సాహస యాత్రలో భాగంగా ప్రధాని మోదీ ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా ఉన్నారని కొనియాడారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తొణుకుబెణుకు లేకుండా ఉల్లాసంగా కనిపించారని పేర్కొన్నాడు. ఏమాత్రం అనుకూలించని వాతావరణంలో మోదీ ఆత్మస్థయిర్యం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఈ బ్రిటీష్ సాహసికుడు వివరించాడు.
"చాలామంది రాజకీయ నాయకులు ప్రజాజీవనంలో సూటూబూటూ ధరించి స్మార్ట్ గా ఉంటారు. కానీ అడవి చాలా గొప్పది. మీరెవరన్నది దానికి అవసరంలేదు. అంకితభావానికి, తెగువకు అది మురిసిపోతుంది. ఉత్తరాఖండ్ లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో భారత ప్రధాని మోదీ, నేను ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నాం. భారీ వర్షాల నడుమ, జలపాతాల్లో పెద్ద పెద్ద బండరాళ్లను ఢీకొన్నాం.
మా సాహసయాత్రను చిత్రీకరించే బృందం కూడా కొన్నిసార్లు ప్రమాదం అంచున నిలిచింది. కానీ ప్రధాని మోదీ మాత్రం నింపాదిగా కనిపించారు. ఆయనను ఆ విధంగా చూడడం ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మోదీ ప్రపంచస్థాయి నాయకుడు" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించాడు.