India: భారత్ వైపు నడిచే మరో రైలును కూడా రద్దు చేసిన పాక్
- ఖోక్రాపార్ - మునాబా మధ్య నడిచే 'థార్' వీక్లీ ఎక్స్ ప్రెస్ ‘తార్’
- ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ ప్రకటన
- నిన్ననే ‘సంఝౌతా’ను నిలిపివేసిన పాక్
జమ్ముకశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దుతో అట్టుడికిపోతున్న పాకిస్థాన్, భారత్-పాక్ దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును ఇప్పటికే నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా, భారత్ వైపు నడిచే మరో ఎక్స్ ప్రెస్ రైలు ను నిలిపివేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్థాన్ లోని తార్ పార్కర్ జిల్లాలో ఉన్న ఖోక్రాపార్ నుంచి భారత్ లోని మునాబా (రాజస్థాన్) వరకూ నడిచే 'థార్' వీక్లీ ఎక్స్ ప్రెస్ ను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ ప్రకటించారు. తాను పాక్ రైల్వేమంత్రిగా ఉన్నంత వరకూ ఇరు దేశాల మధ్య ఏ ఒక్క రైలు నడవదని విలేకరులతో రషీద్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.