Ayodhya: అయోధ్య కేసులో ప్రతి రోజు విచారణకు హాజరుకావడం కష్టంగా ఉంది: సుప్రీంకోర్టుకు తెలిపిన సున్నీ వక్ఫ్ బోర్డు
- అయోధ్య స్థల వివాదాన్ని పరిష్కరించడంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలం
- కేసుకు సంబంధించి ప్రతిరోజు వాదనలు వింటున్న సుప్రీంకోర్టు
- ప్రతిరోజు డాక్యుమెంట్లను రెడీ చేయడం కష్టమన్న వక్ఫ్ బోర్డు తరపు లాయర్
అయోధ్య-బాబ్రీ మసీదు స్థల వివాదాన్ని పరిష్కరించే విషయంలో సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ నుంచి ఈ కేసుకు సంబంధించిన వాదనలను సుప్రీంకోర్టు ప్రతిరోజు వింటోంది. ఈ నేపథ్యంలో, ప్రతిరోజు విచారణకు హాజరు కావడం తమ వల్ల కావడంలేదని సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకు విన్నవించింది.
సున్నీ వక్ఫ్ బోర్డు తరపున సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ మాట్లాడుతూ, వారంలో ప్రతిరోజు కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని చెప్పారు. తమ ఇబ్బందిని కోర్టుకు తొలిసారి తెలియజేస్తున్నామని... కేసు వాదనలను ఈ విధంగా కొనసాగించడం తమకు ఇబ్బందిగా ఉందని చెప్పారు. ప్రతిరోజు డాక్యుమెంట్లను రెడీ చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారమని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ, రాజీవ్ ధావన్ విన్నపాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని... ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.