Hashim Amla: అంతర్జాతీయ క్రికెట్ కు హషీమ్ ఆమ్లా గుడ్ బై

  • అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సౌతాఫ్రికా ఆటగాడు 
  • ఇటీవల వరల్డ్ కప్ లో పేలవ ప్రదర్శన
  • దేశవాళీ పోటీలకు అందుబాటులో ఉంటానని ప్రకటన

 ఏ ఫార్మాట్ కైనా అతికినట్టు సరిపోయే అతి తక్కువ మంది క్రికెటర్లలో హషీమ్ ఆమ్లా ఒకడు. ఈ సౌతాఫ్రికా దిగ్గజం తాజాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను రిటైరవుతున్నట్టు ఆమ్లా పేర్కొన్నాడు. 36 ఏళ్ల ఆమ్లా 124 టెస్టుల్లో 9,282 పరుగులు చేశాడు. వాటిలో 28 సెంచరీలు, 41 అర్ధసెంచరీలు ఉన్నాయి. 181 వన్డేలు ఆడిన ఈ రైట్ హ్యాండర్ 49.46 సగటుతో 8113 పరుగులు సాధించాడు. ఆమ్లా ఖాతాలో 27 వన్డే సెంచరీలు, 39 ఫిఫ్టీలున్నాయి. టి20 క్రికెట్ విషయానికొస్తే, 44 మ్యాచ్ ల్లో 132 స్ట్రయిక్ రేట్ తో 1277 పరుగులు నమోదు చేశాడు.

కలిస్, ఏబీ డివిలియర్స్ తర్వాత వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన సౌతాఫ్రికా క్రికెటర్ ఆమ్లానే. కాగా, తన రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా ఆమ్లా భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. తన అద్భుత కెరీర్ దేవుడి కారణంగా ప్రాప్తించిందంటూ వినమ్రంగా తెలిపాడు.

ఇటీవల వరల్డ్ కప్ లో పేలవ ఆటతీరుతో ఆమ్లా విమర్శలపాలయ్యాడు. అయితే, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా, దేశవాళీ క్రికెట్ కు మాత్రం అందుబాటులోనే ఉంటానని వెల్లడించాడు. రికార్డుల విషయానికొస్తే, అత్యధిక సెంచరీలు సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ఆమ్లానే అగ్రగణ్యుడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక సఫారీ క్రికెటర్ రికార్డు కూడా ఆమ్లా పేరిటే ఉంది.

Hashim Amla
Cricket
South Africa
  • Loading...

More Telugu News