USA: అమెరికాలో కత్తితో రెచ్చిపోయిన ఉన్మాది.. నలుగురి దుర్మరణం!
- దక్షిణ కాలిఫోర్నియాలోని గార్డెన్ గ్రోవ్ లో ఘటన
- పలు దోపిడీలు, హత్యలకు పాల్పడిన నిందితుడు
- ఇద్దరి పరిస్థితి విషమం.. నిందితుడ్ని సజీవంగా పట్టుకున్న పోలీసులు
అగ్రరాజ్యం అమెరికా మరోసారి నెత్తురోడింది. దక్షిణ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ ఉన్మాది కత్తితో స్థానికులపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ప్రజలను తరుముతూ కత్తితో పొడిచాడు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడి(33)ని పోలీసులు సజీవంగా పట్టుకోగలిగారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4.23 గంటలకు నిందితుడు గార్డన్ గ్రోవ్ పట్టణంలోని ఓ బేకరిలో దోపిడీకి పాల్పడ్డాడు.
అనంతరం అటుగా వెళుతూ ఓ అపార్ట్ మెంట్ దగ్గర ఇద్దరిపై కత్తితో దాడిచేశాడు. వీరిలో ఒకరు మార్గమధ్యంలోనే చనిపోగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితుడు చెక్-క్యాషింగ్ బిజినెస్ వద్ద కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడు. ఈ దోపిడీ జరిగిన కొద్దిసేపటికే ఓ మహిళతో పాటు పలువురిని నిందితుడు కత్తితో పొడిచాడు. అనంతరం గార్డెన్ గ్రోవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో డబ్బులను లూటీ చేసిన దుండగుడు.. అక్కడ కూడా కొందరిపై కత్తితో దాడిచేశాడు.
ఈ సందర్భంగా అక్కడి సెక్యూరిటీ గార్డును కత్తితో పొడిచి అతని తుపాకీ లాక్కుని పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని కారులో వెంబడించి సజీవంగా పట్టుకున్నారు. ఈ విషయమై గార్డెన్ గ్రోవ్ పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు పిచ్చకోపంతో ఉన్నాడనీ, అయితే ఈ హత్యలు, దోపిడీలు ఎందుకు చేశాడన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. ఈ దుర్ఘటనలో నలుగురు చనిపోగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.