Andhra Pradesh: కోడెలపై టీడీపీ నేతల తిరుగుబాటు.. అపాయింట్ మెంట్ ఇచ్చిన అధినేత చంద్రబాబు!
- కోడెలను ఇన్ చార్జీగా తప్పించాలన్న సత్తెనపల్లి నేతలు
- ఆయనతో పార్టీ తీవ్రంగా దెబ్బతింటోందని వ్యాఖ్య
- ఈరోజు సాయంత్రం 4 గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై టీడీపీ అసమ్మతి నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ చార్జీగా కోడెలను వెంటనే తప్పించాలనీ, కోడెలను ఇన్ చార్జీగా కొనసాగిస్తే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోతుందని సత్తెనపల్లి పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కోడెల కుటుంబ సభ్యులపై నమోదైన కేసుల కారణంగా పార్టీపై స్థానికంగా వ్యతిరేకత వస్తోందని అన్నారు.
ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు ఈ విషయమై తిరుగుబాటు నేతలతో చర్చించాలని నిర్ణయించారు. అందుకోసం సదరు నేతలకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో సత్తెనపల్లి కొత్త ఇన్ చార్జీగా చంద్రబాబు ఎవరిని నియమిస్తారోనని పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.