China: లడఖ్ ఎఫెక్ట్.. భారతీయులకు కైలాశ్ మానస సరోవర్ వీసాలను నిరాకరించిన చైనా!
- లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై గుర్రుగా ఉన్న చైనా
- తమ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా భారత్ వ్యవహరిస్తోందని మండిపాటు
- లడఖ్ తమ అంతర్గత వ్యవహారమన్న భారత్
లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై చైనా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో, కైలాశ్ మానస సరోవర్ యాత్రకు వెళ్లాలనుకున్న కొందరు భారతీయులకు వీసా ఇచ్చేందుకు నిన్న నిరాకరించింది. తద్వారా భారత్ పై తన అక్కసును వెళ్లగక్కింది.
లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా భారత్ ప్రకటించిన వెంటనే చైనా స్పందించింది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతించబోమని తెలిపింది. దక్షిణ భాగంలో ఇండో-చైనా సరిహద్దులో ఉన్న ప్రాంతం తమదేనని.. చైనా భూభాగాన్ని ఇండియా తన అధీనంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు తమ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేలా ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల భారత్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. లడఖ్ అంశం తమ అంతర్గత వ్యవహారమని సమాధానమిచ్చింది.
ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో భారత్ కల్పించుకోదని... ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి కూడా తాము ఇదే ఆశిస్తున్నామని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు.