India: సుష్మ నాకు ప్రతి ఏటా రాఖీ కట్టేది.. అన్నా అంటూ నోరారా పిలిచేది!: వెంకయ్య నాయుడు భావోద్వేగం
- బీజేపీ నేతకు రాజ్యసభ నివాళులు
- సుష్మ స్వరాజ్ నాకు సోదరిలాంటిది
- ఈసారి ఆమెతో రాఖీ కట్టించుకునే అవకాశం కోల్పోయా
- రాజ్యసభలో కన్నీరు పెట్టుకున్న వెంకయ్య నాయుడు
బీజేపీ దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కు రాజ్యసభ ఈరోజు నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు స్పందిస్తూ.. సుష్మా స్వరాజ్ కు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అత్యంత ప్రావీణ్యం ఉందని తెలిపారు. పార్లమెంటు లోపల, బయట తన ప్రవర్తనతో చేపట్టిన ప్రతీ పదవికి సుష్మ విశిష్ట గౌరవాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారు.
చనిపోవడానికి కొన్ని గంటల ముందు ట్విట్టర్ లో ఆర్టికల్ 370 రద్దుపై సుష్మ స్పందిస్తూ.. ‘ఈరోజును చూడటం కోసమే నేను ఇన్నేళ్లు ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు. సుష్మ చనిపోవడం తనకు తీరని నష్టమనీ, ఆమె తనకు సోదరిలాంటిదని తెలిపారు. ‘సుష్మ నన్ను అన్నా అని నోరారా పిలిచేవారు. మా కుటుంబంలో జరిపే ప్రతీ శుభకార్యానికి, వేడుకలకు హాజరయ్యేవారు.
రాఖీపండుగ రోజు సుష్మ మర్చిపోకుండా నాకు రాఖీ కట్టేది. నేను ఉపరాష్ట్రపతిని అయ్యాక.. అన్నా.. మీరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి. కాబట్టి మా ఇంటికి రావడం బాగుండదు. నేనే మీ ఇంటికి వచ్చి రాఖీ కడతా అని చెప్పారు. చెప్పినట్లే మా ఇంటికి వచ్చి నా చేతికి రాఖీ కట్టారు. కానీ ఈ ఏడాది ఆ అవకాశాన్ని నేను కోల్పోయా’ అని వెంకయ్య కన్నీరు పెట్టుకున్నారు. సుష్మ లాంటి సోదరిని కోల్పోవడం తనకు తీరని లోటని వ్యాఖ్యానించారు.