Jammu And Kashmir: ఇప్పుడు లడఖ్ ప్రజల గొంతుకను వినే ప్రభుత్వం కేంద్రంలో ఉంది: లడఖ్ ఎంపీ సేరింగ్ నమ్ గ్యాల్

  • ఇంతకాలం తమ ప్రజలకు తీరని అన్యాయం జరిగింది
  • లడఖ్ ను యూటీగా గుర్తించడంతో మేలు జరుగుతుంది
  • కాంగ్రెస్ ఇంకా ఎంతకాలం ప్రజలను మభ్యపెడుతుంది?

జమ్ముకశ్మీర్ లోని లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై అక్కడి ఎంపీ సేరింగ్ నమ్ గ్యాల్ హర్షం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ విభజన బిల్లుపై చర్చ సందర్భంగా లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లును తాను స్వాగతిస్తున్నానని అన్నారు. ఇంతకాలం తమ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని, లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించడంతో ఇకపై తమ పౌరులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని నమ్ముతున్నానని అన్నారు. ఇప్పుడు తమ ప్రజల గొంతుకను వినే ప్రభుత్వం కేంద్రంలో ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ విభజనతో లడఖ్, కార్గిల్ ప్రాంత ప్రజలు సంతోషంగా లేరంటూ కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు సబబు కాదని, ఇంకా ఎంతకాలం అక్కడి ప్రజలను మభ్యపెడతారని ప్రశ్నించారు. మొదటి నుంచీ కూడా కశ్మీర్ తో కలవాలన్న ఉద్దేశం లడఖ్ ప్రాంత ప్రజలకు లేదని, జమ్ముకశ్మీర్ ను విభజన చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా తీసుకురావడం, అందులో తమ ప్రాంతం ఉండటాన్ని తమ ప్రజలు స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ తో సంబంధం లేకుండా లడఖ్ ను వేరుగా పరిగణించాలని మొదటి నుంచి పోరాడుతున్నామని, తమ పోరాటాన్ని ఎవరూ పట్టించుకోలేదని గుర్తుచేశారు.

Jammu And Kashmir
Ladakh
Mp
Tsering
  • Loading...

More Telugu News