Article 375: కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని సమర్థించిన సీనియర్ నేత... ఇరకాటంలో కాంగ్రెస్
- చారిత్రాత్మక తప్పిదాన్ని ఆలస్యంగానైనా సరిచేసినట్టైంది
- రామ్ మనోహర్ లోహియా ఈ ఆర్టికల్ ను తొలి నుంచి వ్యతిరేకించారు
- ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
కశ్మీరీలకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సమయంలో... సదరు బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, బిల్లుకు మద్దతు పలుకుతూ సొంత పార్టీకి చెందిన సీనియన్ నేత జనార్దన్ ద్వివేది చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు షాక్ కు గురయ్యారు. ఓ మీడియా సంస్థతో జనార్దన్ ద్వివేది మాట్లాడుతూ, ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని ఈరోజు సరి చేసినట్టైందని ఆయన వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతికి గురైంది.
తనకు స్ఫూర్తిప్రదాత అయిన రామ్ మనోహర్ లోహియా తొలి నుంచి ఆర్టికల్ 370ని వ్యతిరేకిస్తూ వచ్చారని... విద్యార్థులుగా ఉన్న తాము ఆయన అభిప్రాయాలపై చర్చించుకునేవారమని ద్వివేది తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం యావత్ దేశం సంతృప్తి చెందే విషయమని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో చేసిన తప్పును ఆలస్యంగానైనా సరి చేశారని కితాబిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని... వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడిస్తున్నానని చెప్పారు.