Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ రూపు రేఖలు మార్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం!

  • ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
  • అక్టోబర్ లో కశ్మీర్ లో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్
  • భారీ ఎత్తున పెట్టుబడులను రప్పించడమే లక్ష్యం

ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాక, జమ్ముకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విడగొట్టింది. దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్న జమ్ముకశ్మీర్ రూపు రేఖలు మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్రణాళికనే తయారు చేసినట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్రాన్ని ప్రగతి దిశగా కొత్త పుంతలు తొక్కించేందుకు అడుగులు వేస్తోంది. అక్టోబర్ లో కశ్మీర్ లో ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ను నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. తద్వారా జమ్ముకశ్మీర్ లోకి భారీ ఎత్తున పెట్టుబడులు తరలి వచ్చేలా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయింది. ఈ నేపథ్యంలో, అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం, భూములను కొనుక్కునే హక్కు అందరికీ లభించినట్టైంది. ఆర్టికల్ 370 కింద ఇంతకాలం అధికారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార వ్యవస్థ మినహా మిగిలిన అంశాలన్నింటిపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనంగా ఉండేది. ఆస్తులపై హక్కులు, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు తదితర వ్యవహారాలన్నీ మిగిలిన భారతదేశానికి విభిన్నంగా ఉండేవి. జమ్ముకశ్మీర్ లో ఆస్తులను కొనే హక్కు ఇతర రాష్ట్రాల వారికి ఉండేది కాదు.

ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ఈ ప్రత్యేక ప్రతిపత్తిని జమ్ముకశ్మీర్ కోల్పోయింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడకు వెళ్లి సెటిల్ అవ్వొచ్చు. అక్కడి ఆస్తులను కొనుక్కోవచ్చు. పెట్టుబడులు పెట్టడం, పరిశ్రమలను స్థాపించడం వంటివి చేయవచ్చు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండియన్ పీనల్ కోడ్ ఇకపై జమ్ముకశ్మీర్ లో కూడా అమలవుతుంది. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అక్కడ ప్రభుత్వోద్యోగాలను పొందవచ్చు. జమ్ముకశ్మీర్ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారికి కూడా అక్కడ సమాన హక్కులు లభిస్తాయి.

  • Loading...

More Telugu News