Jammu And Kashmir: ఆర్టికల్ 370 పేరుతో 3 కుటుంబాలు జమ్ముకశ్మీర్ ను దశాబ్దాలుగా దోచుకున్నాయి: అమిత్ షా
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-601ca58e50123f7b60f1952059a0b4efc271037c.jpg)
- 1947లో మహరాజా హరి సింగ్ సంతకం చేశారు
- 1954లో ఆర్టికల్ 370 వచ్చింది
- ఈ ఆర్టికల్ ను రద్దు చేసే విషయంలో క్షణ కాలం కూడా వేస్ట్ చేయబోం
జమ్ముకశ్మీర్ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం, మరోపక్క ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి నుంచి గెజిట్ నోటిఫికేషన్ వెలువడడం క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. విపక్షాల ఊహకు కూడా అందని విధంగా కేంద్ర ప్రభుత్వం తన కార్యాచరణను పక్కాగా అమలు చేసింది. అసలేం జరుగుతోందో విపక్షాలకు అర్థమయ్యేలోగానే తాము చేయాలనుకున్నది మోదీ ప్రభుత్వం చేసేసింది. ప్రస్తుతం రాజ్యసభలో తీవ్ర గందరగోళం మధ్య జమ్ముకశ్మీర్ బిల్లుపై చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఆర్టికల్ 370 అనే గొడుగు కింది మూడు కుటుంబాలు దశాబ్దాలుగా జమ్ముకశ్మీర్ ను లూటీ చేశాయని నిప్పులు చెరిగారు. భారత్ తో జమ్ముకశ్మీర్ ను అనుసంధానం చేస్తున్నది ఆర్టికల్ 370నే అని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ అజాద్ చెబుతున్నారని... ఇది వాస్తవం కాదని చెప్పారు. 1947 అక్టోబర్ 27న జమ్ముకశ్మీర్ ను భారత్ లో కలపాలనే ఫైలుపై మహరాజా హరి సింగ్ సంతకం చేశారని తెలిపారు. 1954లో ఆర్టికల్ 370 వచ్చిందని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేసే విషయంలో క్షణ కాలం కూడా వేచిచూడబోమని స్పష్టం చేశారు.