Karnataka: బీజేపీ నేతపై రూ. 204 కోట్ల దావా వేసిన డీకే శివకుమార్!

  • శివకుమార్ పై బసనగౌడ తీవ్ర విమర్శలు
  • కేసులు పెట్టవద్దని శివకుమార్ వేడుకున్నాడన్న బసనగౌడ
  • రామానగర్ కోర్టులో దావా వేసిన శివకుమార్

తనపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా పరువు తీశారని ఆరోపిస్తూ, కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్, బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాల్‌ పై రూ. 204 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించిన శివకుమార్, జూన్ 23న ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తాను బీజేపీ నాయకులను కలిసి, తనపై కేసులు పెట్టవద్దని వేడుకున్నానని, కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చానని బసనగౌడ ఆరోపించారని గుర్తు చేశారు.

తనపై కేసులు పెట్టకుండా ఉంటే, సంకీర్ణ కూటమి పతనమయ్యే వేళ, తటస్థంగా ఉండేందుకు అంగీకరించినట్టు తప్పుడు వ్యాఖ్యలు చేశారని, వీటి కారణంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టిలో తన విధేయత, చిత్తశుద్ధి దెబ్బతిన్నాయని అన్నారు. సీనియర్ల ముందు తన ప్రతిష్ట మంటగలిసినందునే దావా వేస్తున్నానని తెలిపారు. కాగా, శివకుమార్ వేసిన దావాపై రామానగర్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌  కోర్టు వచ్చే నెల 18న విచారణను ప్రారంభించనుంది.

Karnataka
Congress
Sivakumar
BJP
Law Suit
  • Loading...

More Telugu News