Posani Krishna Murali: పోసాని నాకు అన్నతో సమానం: ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్
- పోసానితో నాకు ఎలాంటి విభేదాలు లేవు
- ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే పోసాని కరెక్టు చేశారు
- అందులో తప్పేముంది?
వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఆయన్ని అభినందించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుులు ఎవరూ రాలేదని ఎస్వీబీసీ చైర్మన్, ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ‘బిగ్ మిస్టేక్’ అంటూ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఖండించడమూ విదితమే. దీంతో, పోసానికి, పృథ్వీకి మధ్య విభేదాలు ఏమైనా ఉన్నాయేమో అన్న అనుమానాలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ స్పందిస్తూ, పోసానితో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. వయసులో తన కన్నా ఆయన పెద్దవారని, ఆయన చెబితే నేర్చుకుంటానని వ్యాఖ్యానించారు. ‘ఒకవేళ ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే మా అన్నయ్య నన్ను కరెక్టు చేశారు. అందులో తప్పేముంది? మేమంతా ఓ కుటుంబం. మా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు లేవు.. ఆయన (పోసాని) ఏమీ తెలుగుదేశం మనిషి కాదు.’ అని అన్నారు.