dubai lotery: లాటరీలో రూ.28.4 కోట్లు...నిజామాబాద్‌కి చెందిన డ్రైవర్‌కు జాక్‌పాట్
- దుబాయ్ డ్రాలో ప్రైజ్‌మనీ
- ఉపాధి వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లిన విలాస్
- అక్కడే అలవాటైన టికెట్ల కొనుగోలు
పొట్టచేత పట్టుకుని ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తికి ఉద్యోగం విషయంలో నిరాశ ఎదురైనా మరో రూపంలో అదృష్టం తలుపుతట్టింది. అక్కడ కొనుగోలు చేసిన ఓ టికెట్‌కు 28 కోట్ల 40 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ రావడంతో రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. ఇందుకు సంబంధించి గల్ఫ్‌న్యూస్ ప్రచురించిన కథనం మేరకు వివరాలు ఇవీ. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన విలాస్ రిక్కా, పద్మ దంపతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. వచ్చిన స్వల్ప ఆదాయంతో బతుకీడ్చడం కష్టంగా ఉండడంతో స్వతహాగా డ్రైవర్ అయిన విలాస్ నెలన్నర రోజుల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ దుబాయ్ వెళ్లాడు. సరైన ఉపాధి లభించక పోవడంతో తిరిగి వచ్చేశాడు.
గతంలోనూ ఓసారి దుబాయ్ వెళ్లిన విలాస్ రెండేళ్లు అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో దుబాయ్‌లో లాటరీ టికెట్లు కొనడం అతనికి అలవాటైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నా లాటరీ టికెట్లు కొనుగోలు వ్యసనాన్ని మానుకోలేకపోయాడు.
ఇటీవలే తన స్నేహితుడు రవి ద్వారా మూడు టికెట్లు కొనుగులో చేశాడు. అందులో ఓ టికెట్‌కు 4.08 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.28.4 కోట్లు) ప్రైజ్‌మనీ రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. లాటరీ నిర్వాహకులే స్వయంగా ఈ విషయాన్ని ఫోన్‌చేసి చెప్పారని విలాస్ తెలిపాడు. విలాస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.