Andhra Pradesh: అక్రమ మైనింగ్ వ్యవహారం.. టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు!
- మరో 12 మందిపై కేసు పెట్టిన పిడుగురాళ్ల పోలీసులు
- గతంలో ఫిర్యాదు చేసిన గురవాచారి అనే వ్యక్తి
- పోలీసులు కేసు పెట్టకపోవడంతో కోర్టులో పిటిషన్
తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కేసు నమోదయింది. గురజాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో యరపతినేని అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారని గురవాచారి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీన్ని పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు, యరపతినేనిపై కేసు నమోదు చేయాలని పిడుగురాళ్ల పోలీసులను ఆదేశించింది.
దీంతో టీడీపీ నేత యరపతినేని, మరో 12 మందిపై పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదుచేశారు. గతంలో యరపతినేని రూ.300 కోట్ల మేర అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. అక్రమ మైనింగ్ ప్రాంతంలో పర్యటించేందుకు వైసీపీ నిజనిర్ధారణ కమిటీ అప్పట్లో ప్రయత్నించగా, పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.