sampoornesh Babu: ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకునే ఆ డైలాగ్ చెప్పాను: సంపూర్ణేశ్ బాబు
- హాస్యకథా చిత్రంగా 'కొబ్బరిమట్ట'
- 3 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా డైలాగ్స్ చెప్పిన సంపూ
- ఈ నెల 10వ తేదీన విడుదల
తెలుగు తెరపై హాస్య కథానాయకుడిగా సంపూర్ణేశ్ బాబుకి మంచి పేరు వుంది. తన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆయన ప్రేక్షకులకు కితకితలు పెడుతుంటాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'కొబ్బరిమట్ట' ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఏకధాటిగా ఆయన 3 నిమిషాల పాటు చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమాలో 3 నిమిషాల పాటు ఆపకుండా నేను చెప్పవలసిన డైలాగ్స్ గురించి దర్శకుడు నాతో ప్రస్తావించాడు. ఒక రోజున నాకు 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్ యమధర్మరాజుగా చెప్పిన డైలాగ్స్ ను చూపించాడు. ఎన్టీఆర్ ఆ డైలాగ్స్ ను ఎంత ఎనర్జీతో చెప్పారో అలా చెప్పాలని అన్నాడు. ఎన్టీఆర్ మాదిరిగా ఎంత ఎనర్జీతో ఆ డైలాగ్స్ ను చెప్పడం మొదలుపెడతావో, అంతే ఎనర్జీతో పూర్తిచేయాలని చెప్పాడు. ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకునే ఆ డైలాగ్ చెప్పాను. అందుకోసం నేను గట్టి కసరత్తు చేయవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చాడు.