srisailam: వేగంగా పెరుగుతున్న శ్రీశైలం నీటిమట్టం.. ప్రస్తుతం 832.3 అడుగులు
- ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహం
- ఇన్‌ఫ్లో 1,75,656 క్యూసెక్కులు
- క్రమంగా పెరుగుతున్న వరద
కృష్ణానదిలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం జల కళ సంతరించుకుంటోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయంలో నీటి మట్టం అత్యంత వేగంగా పెరుగుతోంది. గురువారం రాత్రి ఏడు గంటల సమయానికి జలాశయంలో నీటి మట్టం 823 అడుగులుగా నమోదుకాగా, ఈ ఉదయానికి అది 832.3 అడుగులకు చేరుకుంది.
కేవలం పన్నెండు గంటల వ్యవధిలో దాదాపు పది అడుగుల నీటి మట్టం జలాశయంలో పెరగడం గమనార్హం. కృష్ణమ్మ ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండుకుండల్లా దర్శనమిస్తుండడంతో వరద నీటిని భారీగా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతున్న వరద నీరు 1,75,656 క్యూసెక్కులుగా ఉంది.
నారాయణపూర్ ఆనకట్ట 19 గేట్లను 2 మీటర్ల వరకు ఎత్తి 2.1 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 51.96 టీఎంసీల నీరుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2,400 క్యూసెక్కుల నీటిని తోడుతున్నారు.