welterweight world boxing: కుమార్తెను లైంగికంగా వేధించిన బాక్సింగ్ మాజీ ప్రపంచ చాంపియన్... 18 ఏళ్ల జైలు శిక్ష
- ఏడేళ్ల కుమార్తెపై రెండేళ్లపాటు లైంగిక వేధింపులు
- దోషిగా నిర్ధారించిన శాంటాఫే కోర్టు
- ఫొటోగ్రాఫర్లకు మధ్య వేలు చూపించి అసభ్య ప్రవర్తన
కుమార్తెను పదేపదే లైంగికంగా వేధించిన వెల్టర్‌వెయిట్ ప్రపంచ బాకింగ్స్ చాంపియన్‌కు కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అర్జెంటినాకు చెందిన 48 ఏళ్ల కార్లోస్ బాల్డోమిర్ రెండేళ్లపాటు తన కుమార్తెను లైంగికంగా వేధించాడు. అప్పటికి ఆమె వయసు ఏడేళ్లు మాత్రమే. ఈ కేసులో నవంబరు 2016న అరెస్ట్ అయిన కార్లోస్ విచారణ సందర్భంగా ఇప్పటికే మూడేళ్లు జైలులో ఉన్నాడు. కేసును విచారించిన న్యూమెక్సికో రాజధాని అయిన శాంటాఫే కోర్టు కార్లోస్‌ను దోషిగా నిర్ధారించి 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తుదితీర్పు వెలువరించింది.
2012-2014 మధ్య తన ఏడేళ్ల కుమార్తెపై కార్లోస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అతడి మాజీ భార్య ఆరోపణలు చేసింది. అప్పట్లో ఈ ఆరోపణలు సంచలనమయ్యాయి. ఈ కేసులో పోలీసులు అతడిని 2016లో అరెస్ట్ చేయడంతో ప్రపంచ చాంపియన్ కటకటాల్లోకి వెళ్లాడు. కాగా, తాజాగా కోర్టుకు హాజరైన కార్లోస్ ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించకపోవడం గమనార్హం. అంతేకాదు, తనను కెమెరాల్లో బంధిస్తున్న ఫొటోగ్రాఫర్లకు మధ్యవేలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు.