Cafe Coffee Day: 'కాఫీ డే' సిద్ధార్థది ఆత్మహత్య కాదా?... అసలు ఆ రెండు గంటలూ ఏం జరిగింది?

  • కార్పొరేట్ వ్యవస్థను ఓ కుదుపు కుదిపిన సిద్ధార్థ మృతి 
  • మృతదేహం ముక్కుపై తాజా రక్తం మరకలు
  • విచారణను ముమ్మరం చేసిన పోలీసులు

భారత కార్పొరేట్ వ్యవస్థను ఓ కుదుపు కుదిపిన కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మృతిపై దర్యాఫ్తు చేస్తున్న కొద్దీ సమాధానాలు లేని ప్రశ్నలెన్నో ఉదయిస్తున్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న సమయానికి రెండు గంటల ముందు ఆయన ఎక్కడికో వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది.

జులై 29న సాయంత్రం ఐదున్నర సమయంలో బ్రహ్మర కోట్లో టోల్‌ గేట్‌ ను సిద్ధార్థ కారు దాటి వెళ్లింది. వాస్తవానికి ఆ టోల్ గేట్ నుంచి నేత్రావతి నది వద్దకు గరిష్ఠంగా 30 నిమిషాల్లో వెళ్లవచ్చు. కానీ, రాత్రి 7.30 గంటలకు కారు వంతెనపైకి వచ్చిందని డ్రైవర్ చెప్పాడు. ఈ మధ్య సమయంలో ఆయన ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు. ఈ విషయమై డ్రైవర్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

ఇక డ్రైవర్ బసవరాజు సైతం సిద్ధార్థ కనిపించకుండా పోయిన గంటన్నర తరువాతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో సిద్ధార్థ ఫోన్లో మాట్లాడుతూ కాసేపు అటూ, ఇటూ తిరుగుతూ కనిపించారని, ఆపై అదృశ్యం అయ్యేసరికి, తాను కాసేపు చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేశానన్నది బసవరాజు వాదన. ఆ సమయంలో సిద్ధార్థ ఎవరికి ఫోన్ చేశాడన్న విషయం విచారణలో కీలకం కానుంది.

ఇదిలావుండగా, నదిలో నుంచి కొట్టుకొచ్చిన మృతదేహంపై ఫ్యాంటు, బూట్లు, చేతి ఉంగరాలు మాత్రమే ఉన్నాయి. ఆయన వేసుకున్న షర్ట్ లేదు. ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న తరువాత 36 గంటలు గడిచినా, మృతదేహం  దెబ్బ తినలేదు. పైగా ముక్కు నుంచి రక్తం కారుతున్న గుర్తులు తాజాగానే ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పుడదే పోలీసులకు కొత్త అనుమానాలు వచ్చేలా చేస్తోంది.

సిద్ధార్థ కుటుంబసభ్యులతోపాటు ఆయనతో వ్యాపార సంబంధాలు నడిపిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నామని మంగళూరు దక్షిణ ఏసీపీ తెలిపారు. కాగా, భారత కార్పొరేట్ వర్గంలోని పలువురు ప్రముఖులు సిద్ధార్థ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటుండటం గమనార్హం. ఇక ఆయనది అందరూ అనుకుంటున్నట్టు ఆత్మహత్యా? కాదా? అన్నది పోలీసుల విచారణే తేల్చాలి.

Cafe Coffee Day
Sidhartha
Sucide
Murder
Police
Enquiry
  • Loading...

More Telugu News