Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన 42 విద్యుత్ సంస్థలు
- విద్యుత్ కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపివేసిందన్న విద్యుత్ సంస్థలు
- పిటిషనర్లలో టాటా రెన్యువబుల్, వాల్ వాహన్
- తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
గత ప్రభుత్వం హయాంలో విద్యుత్ సంస్థలతో కుదుర్చుకున్న విద్యుత్ సంస్థల పీపీఏలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందాల వల్ల భారీ ఎత్తున ప్రజా ధనం దుర్వినియోగమయిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో, జగన్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ 42 విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.
పిటిషన్లు దాఖలు చేసిన సంస్థల్లో టాటా రెన్యువబుల్, వాల్ వాహన్ లు కూడా ఉన్నాయి. సోలార్, విండ్ పవర్ కొనుగోళ్లను ప్రభుత్వం నిలిపివేసిందని పిటిషన్ లో విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి. ఈ పిటిషన్లు ఈరోజు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఈ నెల 22న అనుబంధ పిటిషన్లు ఉన్న కారణంగా అదే రోజున విచారణ చేపట్టాలని హైకోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది.