Nayeem: ఆర్టీఐ ద్వారా నయీమ్ కేసు వివరాలు బయటకు... ఆర్.కృష్ణయ్యతో పాటు ఎంతో మంది ప్రముఖుల పేర్లు!
- వివరాలు కోరిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్
- కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు
- టీఆర్ఎస్ నేతలకూ ప్రమేయం!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసు వివరాలను ఇవ్వాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ చట్టం ద్వారా కోరగా, వివరాలను అధికారులు అందించారు. కేసులో భాగంగా పోలీసులు పలువురు ప్రముఖుల పేర్లను చేర్చారు. వీరిలో బీసీ సంఘాల నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పేరు కూడా ఉండటం కలకలం రేపుతోంది.
ఆయనతో పాటు పలువురు పోలీసు అధికారులు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ ల పేర్లు కూడా ఉన్నాయి. ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్ రెడ్డి, డీఎస్పీలు సాయి మనోహర్ రావు, శ్రీనివాస్, ప్రకాశ్ రావు, వెంకటనర్సయ్య, పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పేర్లు కూడా ఉన్నాయి. సీఐలు మస్తాన్, శ్రీనివాసరావు, మాజీద్, వెంకట్ రెడ్డి, వెంకట సూర్య ప్రకాశ్, రవికిరణ్ రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేందర్ గౌడ్, దినేశ్, సాధిక్ మియాల పేర్లనూ అధికారులు చేర్చారు.
ఈ జాబితాలో పలువురు టీఆర్ఎస్ నేతల పేర్లు కూడా ఉండటం గమనార్హం. భువనగిరి కౌన్సిలర్ అబ్దుల్ నాజర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేశ్ మాజీ సర్పంచ్ పింగళ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవ, వెల్దండ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య పేర్లు ఉన్నాయి. అయితే, వీరందరినీ అధికారులు నిందితులుగా చేర్చారా? సాక్షులుగా చేర్చారా? లేక విచారణలో భాగంగా చేర్చారా? అన్న వివరాలు తెలియాల్సివుంది.