teeth: దంత సిరి: ఏడేళ్ల చిన్నారి నోట్లో 526 పళ్లు
- ఐదు గంటలపాటు శ్రమించి తొలగించిన వైద్యులు
- నిత్యం నొప్పి వస్తుండడంతో డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లిన తల్లిదండ్రులు
- దంతాలు చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు
సాధారణంగా ఎదుటి వారిపై కోపం వచ్చేటప్పుడు ‘కొడితే 32 పళ్లూ రాలిపోతాయి’ అంటూ ఉంటాం. కానీ ఆ ఏడేళ్ల చిన్నారి నోట్లో వెతికితే ఏకంగా 526 పళ్లు బయటపడ్డాయి. అదీ కింది దవడ కుడిభాగం నుంచే వీటన్నింటినీ బయటకు తీయడం మరో విశేషం. ఆశ్చర్యంగా ఉందా. కానీ ఇది నిజం.
వివరాల్లోకి వెళితే... చెన్నైలోని ఏడేళ్ల బాలుడు రవీంద్రనాథ్‌కు తరచూ దవడ వాపు, నొప్పి వస్తుండడంతో తల్లిదండ్రులు నగరంలోని సవిత దంత వైద్య కళాశాల ఆసుపత్రికి తీసుకువెళ్లారు. బాలుడికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతని కింది దవడ కుడిభాగంలో సంచిలాంటి నిర్మాణం ఉందని గుర్తించారు. అందులో చిన్నవి, పెద్దవి దంతాలు ఉన్నాయని గుర్తించి సర్జరీ చేయాలని నిర్ణయించారు.
ఐదుగురు వైద్యులు, ఏడుగురు పాథాలజిస్టులు ఐదు గంటలపాటు శ్రమించి అదనంగా ఉన్న దంతాలను తొలగించారు. లెక్కించగా అవి 526 అని తేలడంతో చిన్నారి తల్లిదండ్రులే కాదు, వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. గతంలో ముంబైలో ఓ యుక్త వయసు బాలుడి నోటి నుంచి 232 దంతాలు తొలగించారని, ఇదే ఇప్పటి వరకు అత్యధికమని వైద్యులు చెబుతున్నారు.