Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం మాపై బురద చల్లేందుకే ప్రాధాన్యత ఇచ్చింది: చంద్రబాబు
- అసెంబ్లీ సమావేశాల తీరుపై చంద్రబాబు విమర్శలు
- ప్రజలకు ఉపయోగపడే చర్చలు వైసీపీ చేయలేదు
- అధికారపక్ష సభ్యులు తమ స్థాయి దిగజారి ప్రవర్తించారు
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. పద్నాలుగు రోజుల పాట సాగిన ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, వాదోపవాదాలు, మాటల యుద్ధంతో సాగాయి. శాసనసభా సమావేశాలు సాగిన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు.
ఈ అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే చర్చల కన్నా గతంలో తమ పాలనపై బురద జల్లేందుకే ప్రాధాన్యత ఇచ్చి విలువైన సమయాన్ని, సమావేశాలకు అయ్యే ఖర్చును వృథా చేసిందని విమర్శించారు. హుందాగా వ్యవహరించాల్సిన అధికారపక్ష సభ్యులు తమ స్థాయి దిగజారి ప్రవర్తించారని అన్నారు.
ఇక ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడిచిన సమావేశాలలో వైసీపీ హామీలపై ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేతల గొంతునొక్కి, సస్పెండ్ చేసి
ప్రజాస్వామ్య స్ఫూర్తిని నీరుగార్చారని, కనీస అవగాహన లేకుండా చేసిన ఆరోపణలు, ప్రకటనలు వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ముచేశాయని విమర్శించారు.
ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభూతకల్పనలు, వైసీపీ అధినేత గురించి, ఆ పార్టీకి చెందిన ఇతర సభ్యులు చేసిన భజన కార్యక్రమాలు జనాన్ని ముక్కున వేలేసుకునేలా చేశాయని విమర్శించారు. అయితే ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టబోయి తామే టీడీపీ ప్రభుత్వ విజయాలను సభలో అంగీకరించి ఇన్నాళ్ళూ తాము చేసిన ఆరోపణలు అసత్యాలని ప్రజలకు తెలిసేలా చేశారని అన్నారు. టీడీపీ విషయాని కొస్తే, వైసీపీ హామీలపై ప్రజల తరపున నిలదీసి, ఇది మాట తప్పే ప్రభుత్వమని నిరూపించడంలో విజయం సాధించిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ డొల్లతనాన్ని ఈ సమావేశాలు ప్రజలకు తేటతెల్లం చేశాయని అన్నారు.