health department: తెలుగు రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది ఆందోళన... నిలిచిపోయిన సేవలు
- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నిరసన
- పలు ఆస్పత్రుల ముందు ధర్నా
- జాతీయ వైద్యమండలి బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళనకు దిగడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం నుంచి సేవలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘జాతీయ వైద్య మండలి బిల్లు’ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైద్యసిబ్బంది ప్రభుత్వానికి హెచ్చరికగా ఈ ఒకరోజు నిరసనకు దిగారు.
రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది కూడా నిరసనలో పాల్గొనడంతో అత్యవసర వైద్యసేవలు తప్ప మిగిలినవి ఎక్కడికక్కడ నిలిచిపోయి రోగులకు ఇబ్బందులు తప్పలేదు. హైదరాబాద్ నగరంలోని వైద్యులు నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. అలాగే, గుంటూరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లోనూ వైద్యులు, సిబ్బంది ఆందోళనలో పాల్గొన్నారు. గుంటూరు జీజీహెచ్ ఎదుట ఐఎంఏ, ప్రభుత్వ వైద్యులు, జూనియర్ డాక్టర్లు ధర్నా నిర్వహించారు. తమ ఆందోళనపై ప్రభుత్వం స్పందించకుంటే నిరసన మరింత తీవ్రం చేస్తామని ఆయా ప్రాంతాల్లోని ఆందోళనకారులు హెచ్చరించారు.