Cafe Coffee Day: 'కేఫ్ కాఫీడే' సీఎండీ అదృశ్యం విషాదాంతం.. నేత్రావతి నదిలో లభ్యమైన మృతదేహం!
- వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సిద్ధార్థ
- రెండు రోజుల క్రితం అదృశ్యం
- ఈ ఉదయం మృతదేహం లభ్యం
రెండు రోజుల క్రితం అదృశ్యమైన కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అందరూ అనుమానించినట్టుగానే ఆత్మహత్య చేసుకున్నారు. నేత్రావతి నదిలో ఈ ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది. సోమవారం సాయంత్రం మంగళూరులోని ఉల్లాల్‌లో బ్రిడ్జిపై నుంచి ఆయన దూకేసినట్టు వార్తలు వచ్చాయి.
వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిద్ధార్థ ఓ లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఉల్లాల్‌కు చేరుకున్న సిద్ధార్థ బ్రిడ్జి వద్దకు వెళ్లాల్సిందిగా డ్రైవర్‌ను కోరారు. కారు బ్రిడ్జి చివరికి చేరుకున్నాక కారును ఆపమని చెప్పి దిగారు. బ్రిడ్జిపై కొంతదూరం నడిచి ఆ తర్వాత అదృశ్యమయ్యారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.
90 నిమిషాలు వేచి చూసినా ఆయన తిరిగి రాకపోవడంతో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో వెంటనే బ్రిడ్జి వద్దకు చేరుకున్న మంగళూరు పోలీసులు సిద్ధార్థ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ ఉదయం నదిలో ఆయన మృతదేహం లభ్యమైనట్టు గాలింపు చర్యల్లో పాల్గొన్న ఓ మత్స్యకారుడు తెలిపాడు.