: నల్లగా వుంటే నష్టమేనట...!
చాలామంది తమ రంగు నల్లగా ఉంటే తెగ బాధపడిపోతుంటారు. రంగు మారేందుకు రకరకాల క్రీములు ఉపయోగిస్తుంటారు. మరికొందరు నలుపు నారాయణుడు మెచ్చునంటూ నల్లటి వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే నల్లగా ఉండే వారికి వారి చర్మం వల్ల ప్రమాదమేనని నిపుణులు అంటున్నారు. నలుపు చర్మం ఉండే వారికి చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. నల్లటిచర్మం ఉండేవారు చర్మక్యాన్సర్‌కు, సూర్యుడి నుండి వెలువడే అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, జాతీయ మెలనోమా/చర్మక్యాన్సర్ అవగాహనా మాసం సందర్బంగా ఈ వ్యాధి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి నల్లచర్మం గలవారిలో నలుపు వర్ణద్రవ్యాన్ని తయారు చేసే కణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి సహజసిద్ధంగా అతినీలలోహిత కిరణాలనుండి మనకు రక్షణ కల్పిస్తాయి. అయితే అవి కల్పించే రక్షణ సరిపోదని మాంటేఫియర్ మెడికల్ సెంటర్‌కు చెందిన ఆడమ్ ఫ్రీడ్‌మన్ చెబుతున్నారు. నల్లటివారిలో అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావాలు చాలా నెమ్మదిగా కనిపిస్తాయని, ఈ కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయని ఆయన అంటున్నారు. ఫలితంగా చర్మక్యాన్సర్ వంటి జబ్బులకు దారితీయొచ్చని ఆయన హెచ్చరించారు.
నిజానికి నల్లటి చర్మం ఉండే వారికి చర్మక్యాన్సర్ రావడం చాలా అరుదైన విషయం. అయితే ఈ విషయాన్ని నిర్ధారించడం ఆలస్యమైతే మాత్రం ఇది చాలా తీవ్రంగా పరిణమిస్తుందని ఆయన తెలిపారు. ఎండనుండి మనకు లభించే విటమిన్ డిని అడ్డుకుంటాయని చాలామంది సన్‌స్క్రీన్ లోషన్లను వాడటానికి ఇష్టపడరు. అయితే డి విటమిన్ సంగతి పక్కనబెడితే సూర్యకిరణాల నుండి మనపైకి వచ్చే అతినీలలోహిత రేడియో ధార్మికత నుండి మనల్ని మనం రక్షించుకోవడం చాలా ముఖ్యమని ఫ్రీడ్‌మన్ తెలిపారు. ఎండలో వెళ్లేటప్పుడు ముఖ్యంగా సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉండే సమయం ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ మనం సూర్య కిరణాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు.