Uttar Pradesh: కాటువేసిందన్న కసితో పామును కొరికి ముక్కలు చేసిన మందుబాబు!

- నిద్రిస్తున్న వ్యక్తిని కరిచిన విషసర్పం
- పామును పట్టుకుని అంతుతేల్చిన మందుబాబు
- పాముకాటుకు గురికావడంతో మందుబాబు పరిస్థితి విషమం
ఉత్తరప్రదేశ్ లోని ఇటా జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. మద్యంమత్తులో ఓ మందుబాబు పామును కొరికి ముక్కలు చేశాడు. రాజ్ కుమార్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్న సమయంలో ఓ పాము కరిచింది. దాంతో కోపం కట్టలు తెంచుకున్న స్థితిలో విచక్షణ కోల్పోయిన రాజ్ కుమార్ ఆ పామును పట్టుకుని నోటితో కొరికి ముక్కలు చేశాడు. దాంతో ఆ పాము వెంటనే ప్రాణాలు వదిలింది కానీ, రాజ్ కుమార్ పరిస్థితి కూడా విషమించింది. విష ప్రభావంతో అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పేదకుటుంబం కావడంతో తన కుమారుడ్ని ఎవరైనా ఆదుకోవాలంటూ రాజ్ కుమార్ తండ్రి కనిపించిన ప్రతి ఒక్కరినీ దీనంగా వేడుకుంటున్నాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ మందుబాబు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
