america: అమెరికాలో ఫుడ్‌ఫెస్టివల్‌పై దుండగుడి కాల్పులు.. భయంతో పరుగులు తీసిన జనం
- తొలుత టపాకాయల పేలుళ్లుగా భావించిన జనం
- తర్వాత హాహాకారాలు చేస్తూ పరుగులు
- జాగ్రత్తగా ఉండాలంటూ ట్రంప్ ట్వీట్
అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. నార్త్ కాలిఫోర్నియాలోని గిల్‌రోలో ఆదివారం జరిగిన వార్షిక ఫుడ్‌ఫెస్టివల్‌పై దుండగుడు కాల్పులతో విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల శబ్దం విని జనం పరుగులు తీశారు. దీంతో ఏం జరుగుతోందో తెలియక అయోమయం నెలకొంది. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాల్పుల్లో గాయపడిన ఓ చిన్నారి తమ కళ్లముందే నేలపై పడ్డాడని 15 ఏళ్ల ఎవెనీ రెయెస్ అనే బాలుడు తెలిపాడు. టపాకాయల పేలుళ్లుగా భావించి తొలుత తాము అక్కడే ఉన్నామని, ఆ తర్వాత ఏడుస్తూ, అరుస్తూ జనం పరుగులు పెడుతుండడంతో తాము కూడా బయటకు వచ్చామని తెలిపాడు. టేబుళ్లు తోసుకుంటూ బయటకు పరిగెత్తారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. నిందితుడు ఇంకా పట్టుబడలేదని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.