Hyderabad: అదృశ్యమైన ఇద్దరు చిన్నారుల విషాదాంతం : కుంటలో మునిగి మృతి

  • రెండు రోజుల తర్వాత బయటపడిన మృతదేహాలు
  • ప్రమాదమా? చంపేశారా? అన్న కోణంలో పోలీసుల విచారణ
  • బిడ్డల మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

బిడ్డలు క్షేమంగా తిరిగి వస్తారన్న వారి ఆశ నిజం కాలేదు. ప్రార్థనలు ఫలించలేదు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. పోలీసుల కథనం మేరకు...హైదరాబాద్‌ నగరం మైలార్‌దేవుపల్లి ఠానా పరిధిలోని కింగ్స్‌ కాలనీలో ఉండే నజీముద్దీన్‌ కొడుకు రఫియుద్దీన్‌ హరుణ్‌ (10), మొహ్మద్‌ యూసుఫ్‌ కుమారుడు మొహ్మద్‌ తౌఫిక్‌ (11) కాలాపత్తర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. ఈనెల 25న పాఠశాల నుంచి తిరిగి వచ్చాక ఇద్దరూ ఇంటి ముందు ఆడుకుంటున్నారు. కొంతసేపటి తర్వాత కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో అదేరోజు రాత్రి మైలార్‌దేవుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా ఆడుకుంటూ చిన్నారులు తమ వీధి నుంచి వెళ్తుండడం కనిపించింది. సీసీ పుటేజీ ఆధారంగా ఆరా తీసినా పిల్లల ఆచూకీ తెలియరాలేదు. కాగా, శనివారం సాయంత్రం కింగ్స్‌ కాలనీ సమీపంలోని బంరుక్‌నుద్దౌలా చెరువులో ఉన్న ఇద్దరు చిన్నారుల మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు అదృశ్యమైన చిన్నారుల తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాలను వారికి చూపించారు. వారు తమ పిల్లలే అని చెప్పి భోరుమనడంతో అదృశ్యం మిస్టరీ వీడిపోయింది. అయితే పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోయారా? ఎవరైనా నీళ్లలో ముంచి హతమార్చారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News