Venkaiah Naidu: జైపాల్ రెడ్డితో నా స్నేహం అక్కడే కుదిరింది: వెంకయ్యనాయుడు

  • దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ ఆయనే
  • మంచి వాగ్ధాటి, వ్యక్తిత్వం నాకెంతో ఇష్టం
  • అందువల్లే మంచి స్నేహితులం అయ్యామన్న వెంకయ్య

కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌ రెడ్డి మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వచ్చి భౌతికకాయానికి నివాళులర్పించిన వెంకయ్య, తామిద్దరి మధ్యా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జైపాల్ రెడ్డి వ్యక్తిత్వం, ప్రజా సమస్యలను చూసే కోణంతో పాటు, మాట్లాడే విధానం, వాగ్ధాటి తనకెంతో ఇష్టమని, అవే తమను మంచి మిత్రులగా మార్చిందని అన్నారు. విద్యార్థి దశ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆపై మంత్రిగా జైపాల్ వేసిన అడుగులు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని అన్నారు.

చిన్నతనంలోనే పోలియో బారిన పడ్డా, అకుంఠిత దీక్షతో ఉన్నతమైన స్థాయికి జైపాల్ ఎదిగారని అన్నారు. తన అపారమైన మేధస్సుతో అందరినీ ఆకట్టుకునేలా విశ్లేషణ చేయగలగడం ఆయన సొంతమని, ఆంగ్ల భాషలో పట్టున్న నేతని కొనియాడారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ గా తొలిసారి పురస్కారాన్ని అందుకున్నది కూడా జైపాల్ రెడ్డేనని వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.

Venkaiah Naidu
Jaipalreddy
Dimise
Passes away
condolence
  • Loading...

More Telugu News