Jayaram: నా వ్యాఖ్యలు ముస్లింలకు బాధ కలిగిస్తే కనుక వాటిని ఉపసంహరించుకుంటున్నా: ఏపీ మంత్రి జయరాం

  • సీఎం జగన్ ను అల్లాతో పోల్చిన మంత్రి జయరాం 
  • అల్లాతో ఎవరినీ పోల్చకూడదన్న టీడీపీ నేత ఫతావుల్లా
  • జగన్ దేవుడిలాంటి వ్యక్తి అని చెప్పడమే తన ఉద్దేశం అన్న మంత్రి 

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ కొన్నిరోజుల కిందట ఏపీ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సీఎం జగన్ ను వేనోళ్ల కీర్తించారు. సీఎం జగన్ ముస్లింలకు అల్లా, ఎస్సీలకు అంబేడ్కర్, క్రిస్టియన్లకు జీసస్ లాంటివాడని అభివర్ణించారు. దీనిపై టీడీపీ మైనారిటీ విభాగం నేత ఫతావుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. అల్లాతో ఎవరినీ పోల్చకూడదని ఖురాన్ చెబుతోందని, కానీ, జగన్ ను అల్లాతో పోల్చుతూ మంత్రి జయరాం వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

దీనిపై, మంత్రి జయరాం తాజాగా స్పందించారు. నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ ద్వారా ఇచ్చే పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50 శాతం వాటా కల్పించినందునే జగన్ దేవుడి లాంటి వ్యక్తి అని చెప్పానే తప్ప, తనకు ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు ముస్లిం మైనారిటీలకు బాధ కలిగిస్తే వాటిని తక్షణమే ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు.

Jayaram
Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News