Andhra Pradesh: జమ్మూకశ్మీర్ లో భీకర ఎన్ కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సహా ఇద్దరి కాల్చివేత!
- కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఘటన
- ఇంట్లో నక్కిన జైషే, స్థానిక ఉగ్రవాది
- భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న బలగాలు
జమ్మూకశ్మీర్ లో భద్రతబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఈరోజు భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు కాల్చిచంపాయి. కశ్మీర్ లోని షోపియాన్ జిల్లా బోన్ బజార్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు భద్రతాబలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త బృందం ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలించడం ప్రారంభించింది. అయితే భద్రతాబలగాల అలికిడిని గుర్తించిన ఉగ్రవాదులు ఓ ఇంటి నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. కొద్దిసేపటి తర్వాత ఉగ్రవాదుల వైపు నుంచి కాల్పులు ఆగిపోవడంతో భద్రతాబలగాలు ఆ ఇంట్లోకి దూసుకెళ్లాయి. ఇంట్లో ఇద్దరు ఉగ్రవాదులు రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారు షోపియాన్ ప్రాంతానికే చెందిన జిన్నత్ ఉల్ ఇస్లామ్(22), మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మున్నా లాహోరీ(పాకిస్థాన్ పౌరుడు, జైషే ఉగ్రవాద సంస్థ సభ్యుడు)గా గుర్తించారు.
మున్నా ఐఈడీ బాంబులు తయారు చేయడంలో నిపుణుడనీ, కశ్మీర్ లో పలు ఉగ్రదాడుల్లో పాలుపంచుకున్నాడని పోలీస్ అధికారులు చెప్పారు. ఘటనా స్థలం నుంచి ఓ ఎస్ఎల్ ఆర్, రెండు ఏకే-47 తుపాకులు, 6 యూజీబీఎల్ గ్రనేడ్లు, మూడు చైనీస్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో ఎవరైనా తప్పించుకుని ఉండొచ్చన్న అనుమానంతో భద్రతా బలగాలు గాలింపును కొనసాగిస్తున్నాయి.