Tamil Nadu: ఆర్థిక ఇబ్బందులలో ఉన్న రైతు విందు భోజనం.. చదివింపుల కింద రూ.4 కోట్లు!
- ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయిన కృష్ణమూర్తి
- తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అమలు చేసి కోటీశ్వరుడైన వైనం
- ఒక్క దెబ్బతో అప్పుల్లోంచి కోట్లలోకి
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ రైతు వాటి నుంచి బయటపడేందుకు పెట్టిన విందు భోజనానికి అనూహ్య స్పందన లభించింది. అతడు పెట్టిన విందును ఆరగించిన అతిథులు అతడిని అమాంతం కోటీశ్వరుడిని చేశారు. అక్షరాలా నాలుగు కోట్ల రూపాయలు చదివించి ఆశీర్వదించారు. తమిళనాడులోని పుదుక్కోట జిల్లా కీరమంగళం తాలూకాలోని వడగాడులో జరిగిందీ ఘటన. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఇలా విందు భోజనం ఏర్పాటు చేసే సంప్రదాయం తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో ఉంది. తరతరాలుగా ఇది కొనసాగుతోంది.
వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే రైతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. దీంతో విందుభోజనం పెట్టాలని నిర్ణయించుకున్నాడు. బంధుమిత్రులు, గ్రామస్తులను పిలిచి గురువారం విందు భోజనం ఏర్పాటు చేశాడు. 50 వేల మందిని ఆహ్వానించాడు. అతిథుల కోసం వెయ్యి కిలోల మాంసాన్ని రెడీ చేశాడు. విందు కోసం మొత్తంగా రూ.15 లక్షలు ఖర్చు చేశాడు.
విందును ఆరగించిన అతిథులు తోచిన మొత్తాన్ని చెల్లించి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. పెద్ద మొత్తంలో వచ్చిన చదివింపులను చేతితో లెక్కించడం సాధ్యం కాక ఏకంగా కౌంటింగ్ మిషన్లను తెప్పించారు. కౌంటింగ్‌కు బ్యాంకు ఉద్యోగుల సాయం తీసుకున్నారు. కౌంటింగ్ సమయంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం మరో విశేషం. లెక్కింపు ముగిశాక మొత్తంగా నాలుగు కోట్ల రూపాయలుగా లెక్క తేలింది. ఒక్క విందు భోజనం పెట్టి అప్పటికప్పుడు కోటీశ్వరుడైన కృష్ణమూర్తి ఇప్పుడు వార్తల్లోని వ్యక్తి అయ్యాడు.