Andhra Pradesh: కేశినేని.. వెధవ ట్వీట్లు, సొల్లు చెప్పకుండా రోడ్డుపైకి రా.. ఉద్యోగులకు సెటిల్మెంట్ చేయ్!: పీవీపీ డిమాండ్
- కేశినేని ట్రావెల్స్ పై 10 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నా
- వందల కుటుంబాలు ఈరోజున రోడ్డున పడ్డాయి
- కార్మికుల పొట్టకొడితే పుట్టగతులుండవు
కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టిన విషయంపై తాను గత 10 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నానని వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) తెలిపారు. కంపెనీ యాజమాన్యం కారణంగా కొన్ని వందల కుటుంబాలు ఈరోజున రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరిని కేశినేని నాని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఓ టీవీ ఛానల్ తో ఆయన మాట్లాడారు.
‘వందలాది మంది కార్మికులు, ఉద్యోగుల కష్టార్జితంతో ఇవాళ వీళ్లు మిద్దెలు కట్టారు. వందలకోట్లు సంపాదించారు. అలాంటప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వడానికి సమస్య ఏంటి? వీళ్లంతా బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధులు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ మోహన్ రెడ్డి కడతాడా? అని ప్రశ్నిస్తున్నారు. నేను ఇప్పటికే ఓసారి చెప్పా. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ప్రభుత్వం బడ్జెట్ లో రూ.1,150 కోట్లు కేటాయించింది. అలాగే తన బాధితుల సంఘానికి బడ్జెట్ కేటాయించాలని కేశినేని నానికి సూచించా. కేశినేని ట్రావెల్స్ యాజమాన్యం బాధితులను పిలిపించి మాట్లాడాలి. ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలి. జీతాలు ఎగ్గొట్టి, వ్యాపారాలు మూసేసి ఉద్యోగ కల్పన గురించి మాట్లాడుతారా వీళ్లు? డొక్క చింపితే ఒక్కొక్కడికి అక్షరం ముక్క కూడా రాదు.
కేశినేని ట్రావెల్స్ ఉద్యోగుల సమస్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతా. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తా. కేశినేని నాని డబ్బులు కట్టకపోతే ఊరుకోం. కష్టపడి పనిచేసినవారి కడుపులు కొడితే పుట్టగతులు ఉండవు. వెధవ ట్వీట్లు, వెధవ సొల్లు చెప్పకుండా రోడ్డుపైకి రా. బాధితులతో మాట్లాడు. సెటిల్ మెంట్ చేయ్’ అని కేశినేనిని పీవీపీ డిమాండ్ చేశారు.