chattisgarh: నక్సల్స్ భయంతో మూతపడిన పాఠశాల.. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రారంభం
- చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పద్మాపూర్ స్కూల్
- రెండు రోజుల క్రితం తెరిచిన అధికారులు
- జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో పాఠశాల
ప్రజలు, మావోయిస్టులకు మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో పద్నాలుగేళ్ల క్రితం మూతపడిన ఓ పాఠశాల రెండు రోజుల క్రితం పునఃప్రారంభమయింది. 2005లో మూతపడిన పాఠశాల ఇన్నేళ్ల తరువాత తెరుచుకుని విద్యార్థులతో కళకళలాడింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా పద్మూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నక్సల్స్ భయంతో 14 ఏళ్లపాటు మూతపడింది. జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో పద్మూర్ గ్రామం ఉంది. 2005-06 మధ్య గ్రామ ప్రజలు మావోయిస్టులకు ఎదురు తిరిగారు. దీంతో గ్రామస్థులను లక్ష్యంగా చేసుకుని నక్సల్స్ దాడులు జరిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ధ్వంసం చేశారు. మావోయిస్టుల భయంతో గ్రామస్థులు ఏకంగా ఊరినే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఎక్కడెక్కడో బతికారు.
అధికారుల సహకారంతో 2012లో తిరిగి వారంతా తమ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని పాఠశాల ధ్వంసం చేయడంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారని అధికారుల వద్ద వాపోయారు. దీంతో పద్మూర్లోని స్కూల్‌ను తిరిగి తెరవాలని విద్యాశాఖ నిర్ణయించింది. అప్పటి నుంచి పాఠశాలకు మరమ్మతులు జరిపి బుధవారం స్కూల్‌ను ప్రారంభించారు.
తొలి రోజే 52 మంది చిన్నారులు స్కూల్‌కు వచ్చారు. వీరికి పుస్తకాలు ఇతర సామగ్రి అందించడంతోపాటు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. నక్సల్స్ భయంతో ఛత్తీస్‌గఢ్‌లోని చాలా పాఠశాలలు మూతబడ్డాయి. సుక్మా జిల్లాలో ఇలా 13ఏళ్లుగా మూతపడిన ఐదు పాఠశాలలను గత నెలలోనే అధికారులు తిరిగి తెరిపించారు.