Andhra Pradesh: ఏపీకి ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదు!: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
- ఒక్క రాష్ట్రానికి మేం రాయితీలు ఇవ్వలేం
- విధానపర నిర్ణయాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందే
- వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై మొండిచెయ్యి చూపించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక రాయితీల విషయంలో కూడా మాటమార్చింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టింది. ఒక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయితీలు అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఒకవేళ విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ లోక్ సభ సభ్యుడు అవినాశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు గడ్కరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. విశాఖపట్నంలో ఈరోజు నెలకొల్పిన మెడిటెక్ జోన్ బాగా పనిచేస్తోందని గడ్కరీ అన్నారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం సరైన ప్రతిపాదనలతో వస్తే ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.