TTD: తిరుమలపై టీవీ-5 తప్పుడు వార్తలు... పోలీసులకు వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు!
- డీఈఓగా క్రిస్టొఫర్ ను నియమించారని వార్తలు
- తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న వైవీ సుబ్బారెడ్డి
- భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోబోమని వార్నింగ్
తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తెలుగు టీవీ చానెల్ టీవీ-5 తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని, సదరు చానెల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా క్రిస్టోఫర్ ను నియమించారని ఆ చానెల్ కథనాన్ని ప్రసారం చేసిందని, ఆ వెంటనే సోషల్ మీడియాలో క్రిస్టియన్ ను తిరుమలలోని ఓ ప్రధాన ఉద్యోగంలో ఎలా నియమిస్తారన్న విమర్శలు ప్రారంభమయ్యాయని సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జరగని నియామకాన్ని జరిగినట్టు చెబుతూ, భక్తులను రెచ్చగొట్టేలా సదరు చానెల్ కథనాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు దుష్ప్రచారం చేస్తున్న చానెల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఏర్పాటైన 50 రోజుల్లోనే ఆలయ ప్రతిష్ఠను పెంచే నిర్ణయాలు తీసుకున్నామని, సీఎంగా జగన్ చేస్తున్న మంచి పనులను చూసి కొందరు ఓర్వలేకపోతున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తమ చేతిలో ఉన్న ఎల్లో మీడియాను వాడుకుని, ఇటువంటి తప్పుడు కథనాలను ప్రసారం చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు.