Andhra Pradesh: గ్రామ వాలంటీర్ల ఎంపికను ఆపేయండి.. ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు!
- ప్రతిభ ఆధారంగా ఖాళీలను భర్తీ చేయండి
- విద్యార్హతకు వెయిటేజ్ కల్పించండి
- ప్రభుత్వం ఇచ్చిన జీవో 104ను నిలిపివేయండి
ప్రభుత్వ సేవలను ఇంటింటికి చేరవేసేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపు 4 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇప్పటికే ఇంటర్వ్యూల ప్రక్రియ కూడా ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో గ్రామ వాలంటీర్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియపై ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే కాకుండా ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేశ్ రెడ్డి ఈ పిల్ వేశారు.
అభ్యర్థుల విద్యార్హత ఆధారంగా వెయిటేజ్ మార్కులు ఇవ్వాలని కోరారు. వాలంటీర్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం జారీచేసిన జీవో 104 లోపభూయిష్టంగా ఉందనీ, దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ నెల 11 నుంచి 25 వరకూ మండల పరిషత్ కార్యాలయాల్లో గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి.
ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 1న నియామక పత్రాలు అందజేస్తారు. వీరికి ఆగస్టు 5 నుంచి 10 వరకు పలు అంశాల్లో శిక్షణ ఇస్తారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 15న బాధ్యతలు అప్పగిస్తారు. ప్రతీ 50 ఇళ్లకు ఓ గ్రామ వాలంటీర్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.