Huawei: చైనా మాస్టర్ ప్లాన్.. ఉత్తరకొరియాలో రహస్యంగా 3జీ నెట్ వర్క్ నిర్మాణం పనులు!

  • వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం
  • దీనివెనుక హువావే ఉందన్న పత్రిక
  • కథనాన్ని ఖండించిన హువావే కంపెనీ

చైనాకు చెందిన ప్రముఖ టెలీకమ్యూనికేషన్ పరికరాల తయారీ కంపెనీ హువావే సీఎఫ్ వో  మెంగ్ వాంగ్జూను కెనడా ప్రభుత్వం కొన్ని నెలల క్రితం అరెస్ట్ చేసింది. ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ కు టెక్నాలజీని అందజేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సంచలన కథనాన్ని బయటపెట్టింది. కేవలం ఇరాన్ కు మాత్రమే కాకుండా హువావే కంపెనీ ఉత్తరకొరియాలో సెల్ ఫోన్ నెట్ వర్క్ నిర్మించేందుకు రహస్యంగా సాయం చేసిందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. చైనా ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని చెప్పింది.

ఐక్యరాజ్యసమితి ఆంక్షలు కొనసాగుతుండగానే 2008 నుంచి 2016 వరకూ రహస్యంగా బేస్ స్టేషన్లు, యాంటెన్నాలు ఉత్తరకొరియాకు సరఫరా చేశారనీ, అక్కడ 3జీ నెట్ వర్క్ నిర్మించారని వెల్లడించింది. ఇందుకోసం హువావే, చైనా ప్రభుత్వానికి చెందిన పాండా ఇంటర్నేషనల్ సంస్థ కలసి పనిచేశాయని పేర్కొంది. తమ ప్రాజెక్టులు అమెరికా నిఘా సంస్థలకు దొరక్కుండా హువావే రహస్య కోడ్ లను వాడిందని చెప్పింది.

ఉదాహరణకు ఉత్తరకొరియా అనే పదానికి బదులుగా ఏ9 అనే కోడ్ ను కంపెనీ డాక్యుమెంట్లలో వాడారని తెలిపింది. హువావే మాజీ ఉద్యోగి ఒకరు బయటపెట్టిన పత్రాల ఆధారంగా ఈ కథనాన్ని తాము ప్రచురించినట్లు వెల్లడించింది. కాగా, ఈ ఆరోపణలను ఖండించిన హువావే.. తమకు ఉ.కొరియాలో ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేసింది. చైనాలో ప్రైవేటు కంపెనీలన్నీ ప్రభుత్వం ఆదేశించినట్లు నడుచుకోవాల్సిందే. ప్రజల రహస్య సమాచారాన్ని కూడా ప్రభుత్వ అధికారులతో పంచుకోవాల్సి ఉంటుంది.

Huawei
China
USA
UNO sanctions
iran
North Korea
3G network
  • Loading...

More Telugu News