Pakistan: అమెరికాలో పాక్ ప్రధాని ప్రసంగిస్తుండగా పాక్ వ్యతిరేక నినాదాలు!
- ఇమ్రాన్‌కు ఆదిలోనే ఘోర పరాభవం
- స్వతంత్ర బెలుచిస్థాన్ ఏర్పాటు కోరుతూ నినాదాలు
- పరిస్థితిని అదుపు చేసిన భద్రతా దళాలు
మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఆదిలోనే ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆయనను ఆహ్వానించేందుకు అమెరికా తరఫున కేవలం ఒక్క ప్రొటోకాల్ అధికారి మినహా మంత్రులు, ఉన్నతాధికారులెవరూ రాలేదు. ఇక నేడు అమెరికాలోని పాకిస్థానీయులను ఉద్దేశించి ఇమ్రాన్ ఓ వేదికపై ప్రసంగిస్తుండగా, కొందరు యువకులు పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. స్వతంత్ర బెలుచిస్థాన్ ఏర్పాటు కోరుతూ నినదించారు. దీంతో భద్రతా దళాలు వెళ్లి పరిస్థితిని అదుపు చేశాయి.
అయితే నిరసనకారులు వేదికకు దూరంగా ఉండటంతో ఇమ్రాన్ ప్రసంగానికి ఇబ్బంది తలెత్తలేదు. పాక్‌లో ఓ రాష్ట్రమైన బెలుచిస్థాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని కోరుతూ కొన్నేళ్లుగా నిరసనలు జరుగుతున్నాయి. ఉద్యమకారులను అపహరిస్తూ పాక్ భద్రతా బలగాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయంటూ, ఇమ్రాన్ పర్యటన నేపథ్యంలో రెండు రోజులుగా అమెరికాలోని బెలూచిస్థాన్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ఇమ్రాన్ ప్రసంగం వద్ద నిరసనలు తెలిపారు.