Britian ship: ఇరాన్ స్వాధీనంలో ఉన్న బ్రిటన్ నౌకలోని భారతీయులు క్షేమం
- మత్స్యకారుల నౌకను ఢీకొట్టిన బ్రిటన్ నౌక
- నౌకలో 18 మంది భారతీయులు సహా 23 మంది
- ఇరాన్‌పై మండిపడిన బ్రిటన్
ఇరాన్ స్వాధీనంలోని బ్రిటన్ నౌకలో ఉన్న 18 మంది భారతీయులు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్టు ఇరాన్ పత్రిక ఒకటి తెలిపింది. బ్రిటన్ చమురు నౌక స్టెనా ఇంపెరో మత్స్యకారుల పడవను ఢీకొట్టింది. దీంతో ఆ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. నౌకలోని మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకుంది. వారిలో 18 మంది భారతీయులు ఉన్నారు. ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ సిబ్బందిని విడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. బ్రిటన్, ఇరాన్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ శనివారం తెలిపారు.
కాగా, అంతర్జాతీయ సముద్ర జలాల నిబంధనను ఉల్లంఘించడం వల్లే నౌకను అదుపులోకి తీసుకున్నట్టు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ప్రకటించింది. స్వీడన్‌లోని స్టెనా బల్క్ అనే సంస్థకు చెందిన ఈ నౌకలో భారతీయులతో పాటు ఫిలిప్పీన్స్, లాత్వియా, రష్యా దేశాలకు చెందిన సిబ్బంది ఉన్నారు. తమ నౌకను ఇరాన్ అదుపులోకి తీసుకోవడంపై బ్రిటన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఆమోదయోగ్యం కాదని మండిపడింది. కాగా, నౌకలోని వారంతా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని హార్మొజ్గాన్ ప్రావిన్స్ పోర్ట్ అండ్ మారిటైమ్ సంస్థ డైరెక్టర్ జనరల్ అల్లా మొరాద్ అఫిఫిపూర్‌ను ఉటంకిస్తూ స్థానిక పత్రిక తెలిపింది.