Jammu And Kashmir: కశ్మీర్ పర్యటనలో రక్షణమంత్రి రాజ్ నాథ్.. సరిహద్దులో బుల్లెట్ల వర్షం కురిపించిన పాకిస్థాన్!
- వక్రబుద్ధిని బయటపెట్టుకున్న దాయాది
- భారత ఆర్మీ స్థావరాలపై మెషీన్ గన్లతో కాల్పులు
- దీటుగా తిప్పికొట్టిన భారత సైన్యం.. తోకముడిచిన పాక్
దాయాది దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించుకుంది. జమ్మూకశ్మీర్ లోని నియంత్రణ రేఖ వెంబడి భారత పోస్టులు, గ్రామాలే లక్ష్యంగా అకస్మాత్తుగా కాల్పులు జరిపింది. తేలికపాటి తుపాకులు, మెషీన్ గన్లతో భారత పోస్టులపై గుళ్ల వర్షం కురిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. వెంటనే ప్రత్యేకంగా నిర్మించిన బంకర్లలో దాక్కుని ప్రాణాలు రక్షించుకున్నారు.
ఈ సందర్భంగా బలోనీ గ్రామానికి చెందిన సర్పంచ్ జఫరుల్లా ఖాన్ గాయపడ్డారు. మరోవైపు పాక్ జరుపుతున్న కాల్పులకు భారత్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించింది. పాక్ రేంజర్లు దాక్కుని కాల్పులు జరుపుతున్న బంకర్లపై బుల్లెట్ల వర్షం కురిపించింది. దీంతో తోకముడిచిన పాక్ సైనికులు కాల్పులను ఆపేశారు. కాగా భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్ లో పర్యటిస్తున్న నేపథ్యంలోనే పాక్ ఈ దుశ్చర్చకు దిగడం గమనార్హం.
1999 కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించి నేటికి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆపరేషన్ విజయ్’లో అమరులైన భారత జవాన్లకు రాజ్ నాథ్ ఈరోజు నివాళులు అర్పించారు. ఈ పర్యటనలో భాగంగా కథువా, సాంబా జిల్లాల్లో రెండు వంతెనలను రాజ్ నాథ్ జాతికి అంకితం చేయనున్నారు.